తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు నిరసనలు ఉద్ధృతం చేశారు. అప్పలాయగుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రత్యేక పూజలు నిర్వహించి, కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరుమలలో అనేక వివాదాలు, అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ నాయుడు వ్యవహారశైలి వల్ల కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని మండిపడ్డారు. ఆయనను చైర్మన్ పదవి నుంచి తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను లక్ష్యంగా చేసుకుని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. “బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోలేకపోవడం చంద్రబాబు చేతగానితనం. తమ వ్యక్తిగత విషయాలను ఎక్కడ బయటపెడతారో అని లోకేశ్, చంద్రబాబు భయపడుతున్నారా?” అని ప్రశ్నించారు. “లడ్డూ నెయ్యి విషయంలో ఏమీ లేకపోయినా మెట్లు కడిగిన పవన్ కల్యాణ్… ఇప్పుడు బీఆర్ నాయుడు వ్యవహారంలో ఎలాంటి ‘ప్రోక్షణ’ చేస్తారు? దీనిపై ఎందుకు స్పందించడం లేదు?” అని నిలదీశారు. లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని సిట్ నివేదికలో తేలిందని… కాబట్టి చంద్రబాబు అలిపిరి వద్ద సాష్టాంగ నమస్కారం చేసి హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.








