AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. గవర్నర్ ను కోరిన బీఆర్ఎస్ నేతలు..

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మైనింగ్, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయని, ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సోమవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రం సమర్పించారు. మంత్రికి సంబంధించిన అక్రమ మైనింగ్, భూ కబ్జాలపై ఆధారాలను గవర్నర్‌కు సమర్పించినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.

 

మంత్రికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఆరోపించింది. జంట జలాశయాల పరిరక్షణ ప్రాంతాల్లో సైతం మైనింగ్ చేస్తోందని, దీనికి సంబంధించి కనీస అనుమతులు కూడా తీసుకోలేదని పేర్కొంది. ఈ అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో వివరించింది. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తే, తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సస్పెండ్ చేశారే తప్ప ప్రభుత్వం స్పందించలేదని నేతలు అన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు నోటీసులు ఇచ్చినట్లు ప్రభుత్వం సభలో అంగీకరించడమే అక్రమాలకు నిదర్శనమని వారు వెల్లడించారు.

 

గవర్నర్‌తో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వద్దే హోం శాఖ ఉన్నందున సీఐడీ వంటి రాష్ట్ర ఏజెన్సీలపై తమకు నమ్మకం లేదన్నారు. పొంగులేటి మంత్రిగా కొనసాగితే విచారణను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, కాబట్టి ఆయన్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని కోరారు.

 

అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. దమ్ముంటే పొంగులేటి వ్యవహారంతో పాటు అమృత్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, సింగరేణి అక్రమాలపై కూడా విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. ఈ విషయంలో బీజేపీ మౌనంగా ఉండటాన్ని కూడా ఆయన విమర్శించారు.

ANN TOP 10