భారతదేశ బంగారు ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రంగా అవతరించనుంది. కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో భారీ బంగారు నిక్షేపాలను గుర్తించడమే కాకుండా, వెలికితీత పనులు కూడా అధికారికంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్యం తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బంగారు గనుల ప్రాజెక్ట్‌గా ఇది నిలవనుంది.
జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.400 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ ‘జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్’ను చేపట్టింది. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో ఓపెన్-పిట్ మైనింగ్ పద్ధతిలో తవ్వకాలు జరుపుతున్నారు. ఒక్క జొన్నగిరిలోనే దాదాపు 50 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయని అంచనా. పూర్తిస్థాయిలో ఉత్పత్తి మొదలయ్యాక, రాబోయే 15 ఏళ్ల పాటు ఏటా 1000 కిలోల (ఒక టన్ను) శుద్ధి చేసిన బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం భారత్ ఏటా 800 టన్నులకు పైగా బంగారాన్ని వినియోగిస్తుండగా, దేశీయ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. కర్ణాటకలోని హుట్టి గనుల నుంచి సుమారు 1.5 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ 2000వ సంవత్సరంలోనే మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో, జొన్నగిరి ప్రాజెక్ట్ దేశీయ ఉత్పత్తికి పెద్ద ఊతమివ్వనుంది.
ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రతి టన్ను ముడి ఖనిజం నుంచి సుమారు ఒక గ్రాము బంగారాన్ని ఇక్కడ వెలికితీయనున్నారు. జొన్నగిరితో పాటు రామగిరి, జవ్వాకుల, చిగురుకుంట-బిస్నాతం వంటి ప్రాంతాల్లో కూడా బంగారు నిక్షేపాలను గుర్తించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, ఖనిజ రంగంలో దేశాన్ని స్వావలంబన దిశగా నడిపించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.








