తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు అధికార యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలో ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు.
రూ. 13 వేల కోట్లు..
ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జిల్లాకు సంబంధించిన పలు కీలకమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 13 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక ‘హ్యాం రోడ్ల’ నిర్మాణ పనులకు నల్లగొండ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పునాది వేయనున్నారు.అంతేగాక నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసే కీలకమైన ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ప్రాజెక్టును 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.
సుమారు లక్ష మంది..
ఈ సభ ద్వారా జిల్లా సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నలుమూలల నుండి సుమారు లక్ష మందికి పైగా ప్రజలను, పార్టీ కార్యకర్తలను సమీకరించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సభకు వచ్చే ప్రజలకు, వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు , పోలీస్ శాఖను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించారు.








