AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టవర్లు అవసరం లేకుండా ఇంటర్నెట్.. జియో భారీ ప్రాజెక్టు సిద్ధం..!

మొబైల్ టవర్లు చేరని ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ అందాలంటే ఏం చేయాలి? దీనికి సమాధానంగా ఇప్పుడు అంతరిక్షాన్ని ఉపయోగించుకునే దిశగా అడుగులు వేస్తోంది జియో. భారత్‌కు సొంతంగా ఉపగ్రహాల నెట్‌వర్క్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది.

 

జియో ఛైర్మన్ ఆకాశ్‌ అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్ కోసం ప్రత్యేకంగా తక్కువ ఎత్తులో భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాల వ్యవస్థను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా దూర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, దీవుల వంటి చోట్ల ఇంటర్నెట్ అందించడంలో ఈ సాంకేతికత కీలకంగా మారుతోంది.

 

జియో ప్రతిపాదిస్తున్న వ్యవస్థను ఎల్‌ఈఓ (లో ఎర్త్ ఆర్బిట్) శాటిలైట్ కాన్‌స్టిలేషన్‌ అంటారు. ఇందులో వందల సంఖ్యలో లేదా వేల సంఖ్యలో ఉపగ్రహాలు భూమికి దగ్గరి కక్ష్యలో తిరుగుతాయి. దీంతో సాధారణ శాటిలైట్ సేవలతో పోలిస్తే వేగవంతమైన ఇంటర్నెట్ అందించే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే జియో ప్రపంచంలోని అతికొన్ని సంస్థల సరసన నిలవనుంది. ప్రస్తుతం శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ వంటి సేవలు ఇప్పటికే పనిచేస్తున్నాయి.

 

జియో ఇప్పటికే శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో భాగస్వామ్యాలను పెంచుకుంటోంది. అలాగే దేశంలోనే గ్రౌండ్ స్టేషన్ల నిర్మాణంపై కూడా దృష్టి సారిస్తోంది. ఈ కేంద్రాల ద్వారానే భూమిపై ఉన్న వినియోగదారులు, అంతరిక్షంలోని ఉపగ్రహాల మధ్య సమాచార మార్పిడి జరుగుతుంది. ఈ నెట్‌వర్క్ ఏర్పాటైతే గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, కొండలు, దీవుల్లో ఇంటర్నెట్ సేవలు మరింత విస్తరించే అవకాశం ఉంది. ఫైబర్ కేబుళ్లు వేయడం కష్టమైన ప్రాంతాల్లో ఇది కీలక పాత్ర పోషించవచ్చు.

 

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి సొంత శాటిలైట్ వ్యవస్థ దేశ భద్రత పరంగా కూడా ఉపయోగపడుతుంది. విపత్తుల సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థలను కొనసాగించడం, అత్యవసర సేవలకు మద్దతు ఇవ్వడం, రక్షణ రంగ అవసరాలకు తోడ్పడటం వంటి ప్రయోజనాలు ఉంటాయి.

 

ఇటీవలి కాలంలో భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్కరణల తర్వాత అనేక స్టార్టప్‌లు కూడా ఈ రంగంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో జియో తాజా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై జియో ఇప్పటివరకు ఎలాంటి గడువు ప్రకటించలేదు.

ANN TOP 10