AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉపాధి హామీపై కేంద్రం కుట్ర.. చంద్రబాబు మోదీ చేతిలో తోలుబొమ్మ: వైఎస్ షర్మిల ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ (సంక్షిప్తంగా VB-G RAM G లేదా జీ రామ్ జీ) చట్టంపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం గ్రామీణ పేదల పొట్ట కొట్టేలా ఉందని ఆమె ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లని, దివంగత వైఎస్సార్ హయాంలోనే దేశంలో తొలి జాబ్ కార్డు ఇక్కడ మంజూరైందని ఆమె గుర్తు చేశారు.

ఈ కొత్త ‘జీ రామ్ జీ’ చట్టం వల్ల రాష్ట్రంపై ఏటా రూ. 4,500 కోట్ల అదనపు భారం పడుతుందని షర్మిల వెల్లడించారు. గతంలో ఉపాధి హామీ నిధులలో సింహభాగం కేంద్రమే భరించేదని, కానీ ఇప్పుడు రాష్ట్ర వాటాను 40 శాతానికి పెంచడం వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఇది పెను భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నెలా ఉద్యోగుల జీతాలకే అప్పులు చేసే ప్రభుత్వం, ఈ నిధులను ఎక్కడి నుండి తెస్తుందని ఆమె ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

ప్రధాని మోదీ తీసుకువస్తున్న ఇలాంటి “నల్ల చట్టాల”పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండటం దారుణమని ఆమె విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా కాకుండా మోదీ చేతిలో ఒక తోలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంటనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ కొత్త చట్టాన్ని రద్దు చేయించాలని, పాత ‘నరేగా’ పద్ధతినే పునరుద్ధరించాలని ఆమె కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

ANN TOP 10