ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల వేటలో దేశంలోని ఇతర పారిశ్రామిక రాష్ట్రాలను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలలో 25.3 శాతం వాటాను ఏపీ దక్కించుకుంది. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ నివేదికను ఆధారంగా చేసుకుని వెల్లడైన ఈ గణాంకాలు, ఏపీ పారిశ్రామిక వృద్ధికి అద్దం పడుతున్నాయి. పెట్టుబడుల స్వీకరణలో ఒడిశా (13.1%), మహారాష్ట్ర (12.8%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఈ ఘనతపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ఇది తమ ప్రభుత్వ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (Speed of Doing Business) కు నిదర్శనమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇతరులతో పోటీ పడటం లేదని, అందరినీ అధిగమించి ముందుకు దూసుకెళ్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పారదర్శకమైన విధానాలు, నిర్ణయాలు తీసుకోవడంలో వేగం, పెట్టుబడిదారులకు కల్పిస్తున్న భరోసా వల్లే ఈ అసాధారణ ఫలితం సాధ్యమైందని ఆయన విశ్లేషించారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు, ఓడరేవులు, ఎలక్ట్రానిక్స్ మరియు పునరుత్పాదక ఇంధన రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఏపీకి కలిసివచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వచ్చిన రూ. 26.6 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలలో ఏపీ సింహభాగం దక్కించుకోవడం విశేషం. ఈ పెట్టుబడులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఫ్యాక్టరీల స్థాపన మరియు యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని లోకేశ్ పునరుద్ఘాటించారు.









