రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ రెండో దశలో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలం, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలాల పరిధిలోని ఏడు గ్రామాల నుంచి భూములను సేకరించనున్నారు. మొత్తం 16,666.57 ఎకరాల రైతుల భూమితో పాటు, సుమారు 3,828 ఎకరాల ప్రభుత్వ భూమిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడమే కాకుండా, సీఆర్డీఏ (CRDA) కమిషనర్‌కు పూర్తి అధికారాలను అప్పగించింది.
ఈ భూసమీకరణ ప్రక్రియలో పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చి, తమ పట్టా పత్రాలను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు అందజేశారు. ప్రభుత్వం జనవరి 3న నోటిఫికేషన్ ఇచ్చి, ఫిబ్రవరి 28వ తేదీలోపు భూసేకరణ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని అధికారులకు గడువు విధించింది. దీని కోసం ప్రత్యేకంగా కాంపిటెంట్ అథారిటీ అధికారులను నియమించడమే కాకుండా కార్యాలయాలను కూడా సిద్ధం చేశారు.
అయితే, భూములు ఇచ్చే రైతులు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచారు. వచ్చే నాలుగేళ్లలో భూములను అభివృద్ధి చేసి ఇవ్వాలని, ఒకవేళ ఆలస్యమైతే రైతులకు ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చే నిబంధనను ఒప్పంద పత్రంలో చేర్చాలని కోరుతున్నారు. అలాగే, తమకు కేటాయించే ప్లాట్లను లోతట్టు ప్రాంతాల్లో కాకుండా ప్రధాన రహదారుల పక్కనే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రైతుల అభ్యర్థనలను పరిశీలించి, వారి ఆమోదంతోనే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.









