ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ముందుకు సాగడం శుభపరిణామమని అన్నారు. ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, అండమాన్ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలతో జరిగిన అల్పాహార విందు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో పరిపాలనపై తనకు మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, పెట్టుబడులు కూడా రాష్ట్రం వైపు వెళుతుండటం అభివృద్ధికి సూచిక అని ప్రశంసించారు. రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉందని, దానిని కాపాడుకోవాలని ఏపీ బీజేపీ ఎంపీలకు ఆయన సూచించారు.
అదే సమయంలో, ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ ప్రతిపక్ష పాత్రను కూడా సమర్థంగా పోషించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “మంచి టీమ్‌ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి సమస్యేంటి? పార్టీ గ్రాఫ్ పెంచుకోవడానికి మంచి అవకాశం ఉన్నా ఎందుకు విఫలమవుతున్నారు?” అని ఆయన ప్రశ్నించినట్లు తెలిసింది, తెలంగాణ ఎంపీలు మరింత క్రియాశీలకంగా ఉండాలని క్లాస్ పీకారు.
ఏపీ బీజేపీ ఎంపీలకు మోదీ కీలక సూచన చేశారు. వైసీపీ అధినేత జగన్ మరియు ఆయన పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలను బీజేపీ కూడా అంతే దీటుగా తిప్పికొట్టాలని ప్రధాని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అంతేకాక, తెలుగు రాష్ట్రాల ఎంపీలు కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా, జాతీయ అంశాలపై చురుగ్గా స్పందించాలని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోవాలని మోదీ సూచించారు.









