AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రి పొంగులేటి స్పీచ్ అడ్డుకున్న పాడి కౌశిక్ రెడ్డి..! అప్పుల గోల.. వేదికపైనే ఘర్షణ..

హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో నిర్వహించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం చివరకు రాజకీయం రణరంగంగా మారింది. లబ్ధిదారులకు ఇండ్లు అందజేసే శుభకార్యం కాస్తా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల సవాల్-ప్రతి సవాల్‌లతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సభా వేదికపైనే ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్ధం నడవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను సగంలోనే వదిలేసిందన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే నిధులు విడుదల చేసి వాటిని పూర్తి చేసిందని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. ‘బరాబర్ ఈ ఇండ్లను కేసీఆరే కట్టించారు’ అని బిగ్గరగా కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య ఒకరిపై ఒకరు అరిచే పరిస్థితి వచ్చింది.

అనంతరం మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పుల వల్లే ఇప్పుడు పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విమర్శించారు. పొంగులేటి మాటలకు ఆగ్రహంతో ఊగిపోయిన కౌశిక్ రెడ్డి, వేదికపైనే లేచి నిలబడి మంత్రులతో నేరుగా వాగ్వాదానికి దిగారు.

సభలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు కూడా పోటీపడి నినాదాలు చేసుకోవడంతో తీవ్ర రసాభాస నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి, బీఆర్ఎస్ శ్రేణులను సభా ప్రాంగణం నుంచి బయటకు పంపించి వాతావరణాన్ని అదుపులోకి తెచ్చారు.

ANN TOP 10