రాజమండ్రిలో మద్యం మత్తులో యువకులు కారుతో ఢీకొట్టిన కేసులో పోలీసులు సత్వరమే స్పందించారని మెడికో ప్రియాంక తండ్రి వెంకటేశ్ అన్నారు. తమ కుమార్తెను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమను కొందరు కావాలని ఇంకా కుంగదీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విచారకరమైన ఘటనను ఎవరూ రాజకీయం చేయొద్దని, తమ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోవాలని చేతులు జోడించి వేడుకున్నారు.
ముఖ్యంగా కొన్ని వార్తా ఛానెళ్లు అసత్య ప్రచారాలు చేస్తూ తమ మాటలను వక్రీకరిస్తున్నాయని వెంకటేశ్ ఆరోపించారు. ప్రభుత్వంపైనా, పోలీసు వ్యవస్థపైనా తనకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. పోలీసుల విచారణ సరైన కోణంలో, చాలా సమర్థవంతంగా సాగుతోందని కొనియాడారు. నిందితుడు ఏమాత్రం చట్టం నుంచి తప్పించుకోలేని విధంగా పోలీసులు పక్కా ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారని, వారి పనితీరుపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా మీడియా సైతం బాధ్యతాయుతంగా వ్యవహరించి, తమకు మరింత మనోవేదన కలిగించే వార్తలను ప్రసారం చేయకూడదని ఆయన కోరారు.








