జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) అవకతవకలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర విద్యార్థులు చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు జార్ఖండ్ అసెంబ్లీకి లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు ఈ గందరగోళం మధ్య జార్ఖండ్ అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
జేపీఎస్సీ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు చోటుచేసుకోవడంతో.. నియమాక పరీక్షల్లో సంస్కరణలు తీసుకురావాలని విద్యార్థులు, నిరుద్యోగులు గత కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటం, ఇవాళ సీఎం హేమంత్ సోరెన్ పుట్టినరోజు కావడంతో విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహతో నేతృత్వంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ఈ నిరసనల్లో పాల్గొనేందుకు వేలమంది విద్యార్థులు, ఉద్యోగార్దులు రాంచీకి వచ్చారు
ఉదయం 10.30 గంటలకు పాత అసెంబ్లీ నుంచి విద్యార్థులు ప్రారంభమై.. కొత్త అసెంబ్లీ కాంప్లెక్స్ వైపు బయలుదేరారు. అలా అసెంబ్లీ సమీపంలోకి రావడంతో మరింత ముందుకు రావొద్దని అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గకుండా బారికేడ్లను దాటుకొని అసెంబ్లీకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్స్ ను ప్రయోగించారు. తద్వారా విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో లాఠీచార్జ్ చేశారు.
అయితే విద్యార్థులపై బలప్రయోగం చేయడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ‘నిరసన తెలుపుతున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం తప్పు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉంది. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జార్ఖండ్ ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్స్ ను పరిగణలోకి తీసుకోవాలి. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి’ అని రాహుల్ ఎక్స్ లో రాసుకొచ్చారు.








