విశాఖపట్నం కైలాసగిరిలో నిర్మించిన ప్రతిష్టాత్మక గ్లాస్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దాదాపు ₹7 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు కలిసి ప్రారంభించారు. విశాఖను ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా ఈ కొత్త ఆకర్షణను అభివృద్ధి చేశారు.
ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో 40 మిల్లీమీటర్ల మందం కలిగిన ప్రత్యేక ల్యామినేటెడ్ గాజును ఉపయోగించారు. ఈ గాజును జర్మనీ నుంచి దిగుమతి చేయడం విశేషం. ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఒకేసారి 500 టన్నుల భారాన్ని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. అంతేకాక, గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను కూడా ప్రతిఘటించగలదు. భద్రతా కారణాల దృష్ట్యా, ఒకేసారి 40 మంది సందర్శకులను మాత్రమే బ్రిడ్జ్పైకి అనుమతిస్తారు.
ప్రారంభ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకునేలా మౌలిక సదుపాయాలను రూపొందించామని తెలిపారు. విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించిన ఆయన, త్వరలో కైలాసగిరి ప్రాంతంలో త్రిశూల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.








