AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీకాకుళం డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు ఆరా: గ్రామంలో లేని కలుషిత నీరు

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం, తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు నమోదు కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. వైద్యారోగ్య శాఖ అధికారులు గ్రామంలోని పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. శనివారం రాత్రి నుంచి సోమవారం వరకు ఆరుగురు అస్వస్థతకు గురవగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఐదుగురు చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. అయితే, చికిత్స పొందుతూ మృతి చెందిన 70 ఏళ్ల చిన్నారావు మృతికి డయేరియా కారణం కాదని, ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ మల్టీ ఆర్గాన్ డిస్-ఫంక్షన్ కారణంగా గుండెపోటుతో మరణించారని వైద్యులు నిర్ధారించినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.

గ్రామంలోని నీటి సరఫరా వ్యవస్థను అధికారులు ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా పరీక్షించగా, ఎక్కడా కలుషితం లేదని, నీరు తాగడానికి సురక్షితమేనని తేలింది. అయినప్పటికీ, ముందు జాగ్రత్త చర్యగా బావి నుంచి నీటి సరఫరాను నిలిపివేసి, ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డయేరియా ప్రబలడానికి గల అసలు కారణాన్ని కనుగొనేందుకు డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఎపిడెమియాలజిస్ట్ గ్రామంలోనే ఉండి పరిశీలిస్తున్నారు. వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

గ్రామస్థులు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారో గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సరఫరా అయ్యే నీటిలో ఎక్కడైనా మలినాలు కలుస్తున్నాయా లేక ఇతర కారణాలా అనేది విశ్లేషించాలని సూచించారు. గ్రామస్థులందరికీ సురక్షితమైన మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవడంతోపాటు, సమీప గ్రామాలపైనా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ANN TOP 10