AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమరావతి రెండో దశకు శ్రీకారం… కొత్తగా 20 వేల ఎకరాల సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రెండో దశ భూ సమీకరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడు గ్రామాల పరిధిలో 16,666 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇస్తూ మంత్రివర్గం తీర్మానించింది. ప్రభుత్వ భూమితో కలిపి మొత్తంగా 20 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

 

అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించాలన్నా, ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ, రైల్వే స్టేషన్ వంటి భారీ మౌలిక సదుపాయాలు నిర్మించాలన్నా భూమి అత్యవసరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారమే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, కేబినెట్ సమావేశంలో రెండో దశ భూ సమీకరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో భూసేకరణ చేపట్టబోయే గ్రామాలను కూడా పరిశీలించినట్లు సమాచారం. హరిశ్చంద్రపురం, వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, పెదమద్దూరు, పెదపరిమి గ్రామాలను అధికారులు ప్రతిపాదించారు. ఆయా గ్రామాల్లో భూ లభ్యత, రికార్డులు, యాజమాన్య వివరాలపై అధికారులు సమర్పించిన నివేదికలను కేబినెట్ పరిశీలించింది.

 

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాలు, వడ్డమానులో 1,913 ఎకరాలు, పెదమద్దూరులో 1,145 ఎకరాలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 16,666 ఎకరాలతో పాటు ప్రభుత్వ, అసైన్డ్ భూములను కలిపి మొత్తం 20,494 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

 

ఇప్పటికే మొదటి విడతలో రైతుల నుంచి సుమారు 34,000 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. తాజాగా రెండో విడతలో మరో 20,000 ఎకరాలు సేకరించనున్నారు. వీటికి అదనంగా, సుమారు 16,000 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా సీఆర్డీఏకు అప్పగించనున్నారు. దీంతో రాజధాని నిర్మాణం కోసం మొత్తం దాదాపు 70,000 ఎకరాల భూమి అందుబాటులోకి రానుంది.

 

రైతులు సహకరించాలి: సీఎం చంద్రబాబు

 

ఈ నేపథ్యంలోనే గురువారం సచివాలయంలో రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో, రాజధాని అభివృద్ధికి రైతులు సంపూర్ణంగా సహకరించాలని కోరారు. రైతుల సహకారం లేకపోతే అమరావతి కేవలం ఒక మున్సిపాలిటీగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్గత విభేదాలు, అనవసరమైన జేఏసీలతో సమస్యలు సృష్టించవద్దని, ప్రతి చిన్న విషయానికీ సోషల్ మీడియాలో చర్చ చేయొద్దని సున్నితంగా హెచ్చరించారు. రైతులంతా కలిసికట్టుగా ఒకే ‘అమరావతి అభివృద్ధి కమిటీ’గా ఏర్పడి రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కేబినెట్ నిర్ణయంతో రెండో విడత ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.

ANN TOP 10