AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్మృతి మంధన- పలాష్ ముచ్చల్ పెళ్లిపై అనుమానాలకు తెర..!

టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధన, ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్‌ల వివాహంపై గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఊహించని ఆరోగ్య సమస్యల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన వీరి వివాహం రద్దయిందంటూ వచ్చిన వదంతులకు పలాష్ తల్లి అమితా ముచ్ఛల్ ఫుల్‌స్టాప్ పెట్టారు. పెళ్లి త్వరలోనే జరుగుతుందని, అంతా మంచే జరుగుతుందని ఆమె భరోసా ఇచ్చారు.

 

వివాహానికి కేవలం ఒక్క రోజు ముందు స్మృతి మంధన తండ్రి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో, ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఈ ఆకస్మిక పరిణామంతో పెళ్లిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ బాధ నుంచి తేరుకోకముందే, పలాష్ ముచ్ఛల్ కూడా అనారోగ్యం పాలయ్యాడు. రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా అతడిని మొదట సంగ్లీలోని ఆసుపత్రిలో, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. ఈ వరుస ఘటనలతో ఇరు కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి.

 

ఈ నేపథ్యంలోనే స్మృతి తన సోషల్ మీడియా ఖాతాల నుంచి పెళ్లికి సంబంధించిన కొన్ని పోస్టులను తొలగించడంతో, అభిమానుల్లో అనుమానాలు మరింత బలపడ్డాయి. వివాహం రద్దయిందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఊహాగానాలపై పలాష్ తల్లి అమితా ముచ్ఛల్ తాజాగా స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, “స్మృతి, పలాష్ ఇద్దరూ కష్టకాలంలో ఉన్నారు. నా కొడుకు తన వధువుతో కలిసి ఇంటికి రావాలని కలలు కన్నాడు. నేను వారికోసం ప్రత్యేకంగా స్వాగత ఏర్పాట్లు కూడా చేసి ఉంచాను. దేవుడి దయ వల్ల అంతా సర్దుకుంటుంది. వారి వివాహం అతి త్వరలోనే జరుగుతుంది” అని ఆమె స్పష్టం చేశారు.

 

ప్రస్తుతం స్మృతి తండ్రి, పలాష్ ఇద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్లారిటీతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. భారత జట్టులో కీలక ఓపెనర్‌గా రాణిస్తున్న స్మృతి, సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న పలాష్ త్వరలోనే ఒక్కటవ్వాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

ANN TOP 10