తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ ను ప్రకటించింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల గుర్తులను విడుదల చేసింది. బ్యాలెట్ చివరి గుర్తు నోటా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇప్పటికే మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీల్లో వార్డు, సర్పంచ్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. గ్రామాల్లో ప్రధాన పార్టీలు తమ పార్టీల తరఫున అభ్యర్థులను నిలబెడుతున్నాయి. పెద్ద ఎత్తున స్వతంత్రులు బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల గుర్తుల మీద జరగవు. కాబట్టి ఎన్నికల సంఘం కొన్ని గుర్తులను (ఫ్రీ సింబల్స్) విడుదల చేస్తుంది. ఆయా పార్టీలు తమ తమ అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ అది అనధికారికమే. ఏ పార్టీ గుర్తు ఉండదు. ఆయా పార్టీలు తమ తమ అభ్యర్థులను ఎంచుకుని తమ ‘పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి’గా ప్రచారం చేసుకుంటారు. ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికలకు 30, వార్డు సభ్యుల కోసం 20 గుర్తులను కేటాయించింది. రాష్ట్రంలో గుర్తింపు లేని, రిజిస్టర్ అయిన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల సంఘం విడుదల చేసే ఫ్రీ సింబల్స్‌ను ఎంచుకోవచ్చు.







