ఏపీ ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పలు కీలక విధాన ప్రకటనలు చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వర్తింపచేసేలా ఈ విధాన ప్రకటనలు ఉన్నాయి. వీటిలో మద్యం, విద్యుత్ సహా పలు రంగాలకు సంబంధించినవి ఉన్నాయి. రాష్ట్ర ప్రగతికి పరుగులు పెట్టించేలా వివిధ విధాన నిర్ణయాలు ఉన్నాయని బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ తెలిపారు.
ఇవాళ బడ్జెట్ లో విద్య, మున్సిపాల్టీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు ప్రకటించారు.ఇందులో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందించడంతో స్థానిక సంస్థలకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గనుంది. అలాగే కేంద్రీకృత బిల్లుల చెల్లింపుల విధానం నుంచి మున్సిపాల్టీలకు విముక్తి కల్పించనున్నారు. 2024 ఏప్రిల్ నెల నుంచి తమ బిల్లులను తామే చెల్లింపులు జరుపుకునేలా మున్సిపాల్టీలకు స్వేచ్ఛ కల్పిస్తున్నారు. మున్సిపాల్టీల్లోని చిన్నపాటి పనులకు బిల్లుల చెల్లింపులను ఆ శాఖ సెక్రటరీ ఆమోదం తెలిపే విధానాన్ని ఏర్పాటు చేసిన గత ప్రభుత్వ విధానానికి దీంతో చెక్ పడింది.
పెట్టుబడి వ్యయంతో ప్రాజెక్టులు చేపట్టడానికి అనువుగా బడ్జెట్లో ప్రత్యేక ప్రణాళికలు ప్రకటించారు. ఇందులో ప్రవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రొత్సాహకంగా ప్రాజెక్టులో 20 శాతం మేర వయబులిటి గ్యాప్ ఫండింగ్ ఇచ్చేలా కూటమి ప్రభుత్వం పథకాన్ని రూపొందించింది. ప్రాజెక్టుల గ్యాప్ ఫండింగ్ స్కీం కోసం రూ.2 వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారు. తొలిసారిగా తెలుగు భాషకు నిధులను కేటాయించారు.
మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచారం కోసం బడ్జెట్టులో ప్రత్యేక కేటాయింపులు చేశారు. నవోదయం 2.0 స్కీం కింద మద్యపాన, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం కోసం నిధుల కేటాయింపు చేశారు. కాలుష్య రహిత ఆంధ్రగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేపడుతున్నట్టు బడ్జెట్టులో ఆర్థికమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచేలా చర్యల తీసుకుంటున్నట్లు తెలిపారు. జీరో కాలుష్యం ఉండేలా ప్రణాళికలు రూపకల్పన చేయబోతున్నారు.









