2025 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం పెద్ద ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 1న జరగబోయే బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపు సంబంధించిన ప్రకటనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెల్పనున్నారని సమాచారం. నిపుణులు ఈ కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు మరింత ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. రూ. 10 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపుగా ఉండనున్నది. ఇక, రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఆదాయం గల పన్ను చెల్లింపుదారుల కోసం 25 శాతం పన్ను శ్లాబ్‌ను ప్రవేశపెట్టే అవకాశముంది.
గత ఏడాది కేంద్ర బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని ప్రకటించినప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000కి పెరిగింది. దీని కారణంగా వార్షిక ఆదాయం రూ. 7.75 లక్షల వరకు ఉన్న వేతన పన్ను చెల్లింపుదారులు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, వార్షిక ఆదాయం రూ. 15 లక్షల పైగా ఉన్న వేతన పన్ను చెల్లింపుదారులు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు ప్రభుత్వ వర్గాల పరంగా చూస్తే.. రూ. 10 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపును అమలు చేయడం ద్వారా ప్రభుత్వం ఏటా రూ. 50,000 నుండి రూ. 1,00,000 వరకు నష్టపోయే అవకాశం ఉంది. అయితే, ఈ నిర్ణయానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మధ్యతరగతికి పన్ను రాయితీ ఇచ్చి వినియోగాన్ని పెంచాలని ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. పన్ను భారం తగ్గించడం వల్ల ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు ఉంటుందని, దానివల్ల ఖర్చులు పెరిగి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, పాత ఆదాయపు పన్ను విధానంలో వార్షిక ఆదాయం రూ. 10 లక్షలపై 30 శాతం పన్ను విధించబడుతుంది. కానీ కొత్త విధానంలో రూ. 15 లక్షలపై 30 శాతం పన్ను పడనుంది.గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 5.4 శాతానికి తగ్గిన నేపథ్యంలో, ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోకుండా ఉండాలంటే, మధ్యతరగతి పన్ను భారం తగ్గించి వినియోగాన్ని పెంచడం కీలకమని నిపుణులు చెబుతున్నారు. చూడాలి మరి కేంద్రం ఈ విషయంపై ఎటువంటి చర్యలు చేపట్టనుందో.