ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు సంబంధించి ప్రధానమంత్రి మోదీ కీలక ప్రకటన చేశారు. 38వ జాతీయ క్రీడలను డెహ్రాడూన్‌లో ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఒలింపిక్స్ వల్ల అనేక రంగాల్లో విస్తృత అవకాశాలు వస్తాయని అన్నారు.
భారత్‌లో 2036 ఒలింపిక్స్ నిర్వహణ హక్కుల కోసం తాము విశ్వప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇవి కేవలం క్రీడలకే పరిమితం కాదని, ఇవి జరిగిన ప్రదేశాలలో అన్ని రంగాలు లాభపడతాయని ఆయన అన్నారు. ఒలింపిక్స్ నిర్వహణతో క్రీడాకారులతో పాటు ప్రపంచం నలుమూలల నుంచీ అనేక మంది భారత్‌కు వస్తారని తెలిపారు.
దీంతో ఇక్కడి క్రీడాకారులకు అనేక వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. నిర్మాణ రంగానికి ఊతమివ్వడమే కాకుండా, రవాణా, వసతులు, ముఖ్యంగా పర్యాటక రంగం మెరుగుపడుతుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు.









