ఈ డిజిటల్ ప్రపంచంలో క్షణం కరెంట్ పోతేనే మనం తట్టుకోలేం. కానీ ఆ గ్రామం 76 ఏళ్లుగా చీకట్లోనే మగ్గింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ గ్రామం విద్యుత్ ను చూడలేదు. తాజాగా ఆ గ్రామంలో విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. చత్తీస్ గఢ్, బీజాపూర్ మండలంలోని చిల్కపల్లి గ్రామంలో దశాబ్దాల నిరీక్షణ అనంతరం విద్యుత్ పంపిణీ మొదలైంది.
దీనికి కారణం ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నియాద్ నెల్లయార్ యోజన’ పథకమే.. ఈ పథకం ద్వారా నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న గిరిజన గ్రామాల్లో విద్యుత్ పంపిణీ చేపట్టనుంది ప్రభుత్వం. ఈ స్కీం కింద విద్యుత్ పొందిన ఆరో గ్రామంగా చిల్కపల్లి నిలిచింది. రానున్న రోజుల్లో మరిన్ని గిరిజన గ్రామాలకు విద్యుత్ పంపిణీ చేయనుంది చత్తీస్ గఢ్ సర్కార్.
స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి చిల్కపల్లి గ్రామానికి విద్యుత్ రావడంపై బీజాపుర్ జిల్లా కలెక్టర్ సంబిత్ మిశ్రా సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా మిగిలి ఉన్న గ్రామాలకు విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. నియాద్ నెల్లయార్ యోజన కింద విద్యుత్ పొందిన ఆరో గ్రామంగా చిల్కపల్లి నిలిచిందని కలెక్టర్ సంబిత్ మిశ్రా అన్నారు.
పథకం ఉద్దేశం ఇదే..
‘నియాద్ నెల్లయార్ యోజన’ పథకం కింద నక్సల్స్ ప్రభావం ఉన్న గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించనుంది ప్రభుత్వం. ఆయా గ్రామాలను ఐడియల్ గ్రామాలుగా అభివృద్ధి చేయనుంది. ఈ గ్రామాల్లో గృహ నిర్మాణం, విద్యుద్ధీకరణ, తాగునీటి సరఫరా, రోడ్లు, బ్రిడ్జ్ లు, స్కూళ్ల నిర్మాణం చేపట్టనుంది.
నాలుగు నెలలు శ్రమించి విద్యుత్ లైన్ వేశామని బీజాపూర్ జిల్లాలోని విద్యుత్ విభాగం ఉద్యోగి తెలిపారు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ పంపిణీ లైన్లను చిల్కపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం పెద్ద సవాల్‌గా మారిందని.. అక్కడికి ప్రయాణం చేయడమే చాలా పెద్ద కష్టం.. రోడ్డు సరిగ్గా ఉండదని తెలిపారు.
హ్యాపీగా ఫుడ్ చేసుకుంటాం..
‘మా గ్రామానికి విద్యుత్ రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఈ గ్రామంలో విద్యుత్ లేదు. ఇప్పుడు మేము హ్యాపీగా ఫుడ్ చేసుకుంటాం. పిల్లలు రాత్రి సమయంలో చదువు కుంటారు’ అని చిల్కపల్లికి చెందిన గిరిజన మహిళ తెలిపారు. మరో మహిళ మాట్లాడుతూ.. ‘విద్యుత్ రావడంతో ఇప్పుడు మేము టీవీ చూస్తాం, ఫుడ్ చేసుకుంటాం.. రాత్రుళ్లు రోడ్లపై తిరుగుతాం’ అని అన్నారు.