కేంద్రం ఆదాయపు పన్ను వసూళ్లలో భాగంగా వివిధ వర్గాల నుంచి వసూలు చేస్తున్న టీడీఎస్ (ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్)పై వ్యతిరేకత ఎప్పటి నుంచో ఉంది. అయినా భారత్ తో పాటు పలు దేశాల్లో అమలవుతున్న టీడీఎస్ ను రద్దు చేసేందుకు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో టీడీఎస్ రద్దు కోరుతూ ఏకంగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ దాఖలైంది. కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దమవుతున్న వేళ ప్రముఖ లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ తరఫున మరో లాయర్ అశ్వినీ దూబే ఈ పిటిషన్ దాఖలు చేశారు.
టీడీఎస్ వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని అశ్వినీ ఉపాధ్యాయ్ తన పిటిషన్ లో ఆరోపించారు.టీడీఎస్ విధానం వల్ల సమానత్వ హక్కుతో పాటు అనేక ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. కాబట్టి దీన్ని తక్షణం రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ తప్పుల తడకగా ఉందని వ్యాఖ్యానించింది. అయితే పిటిషనర్ కు ఓ కీలక సూచన చేసింది.
టీడీఎస్ రద్దు కోరుతూ అశ్వినీ దూబే దాఖలు చేసిన ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టులో సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ బెంచ్ పరిశీలించింది. టీడీఎస్ విధానం అన్ని దేశాల్లో అమలవుతుంది కదా అని పిటిషనర్ ను ప్రశ్నించింది. దీనిపై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చిచెప్పేసింది. అయితే పిటిషనర్ ను ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని మాత్రం సుప్రీంకోర్టు సూచించింది. దీంతో ఢిల్లీ హైకోర్టులోకి టీడీఎస్ రద్దు వ్యవహారం చేరబోతోంది.









