తెలంగాణలో చలి పంజా విసురుతోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎకువగా ఉన్నదని చెబుతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.
సిర్పూర్(యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 8.8, ఆదిలాబాద్ జిల్లా బేలలో 9.9 డిగ్రీలు నమోదైంది. జోగులాంబ గద్వాలలో 15.1, సూర్యాపేటలో 15.6, వనపర్తిలో 15.9 డిగ్రీలుగా నమోదైంది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటమే చలి తీవ్రత పెరగటానికి కారణమని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడ్రోజులు చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన 27 జిల్లాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్‌లో ఉష్ణోగ్రతలు తకువ స్థాయికి పడిపోతుంటాయి. ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో నవంబర్‌లోనే చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పదేళ్లతో పోల్చితే ఈ నెల 23న రాత్రి నాలుగు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.