హైదరాబాద్ నగరంలో వర్షాకాలం దృష్ట్యా ఎదురయ్యే వరద సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా (HYDRA) యంత్రాంగం సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. రాబోయే వానాకాలం సీజన్‌కు మరో నెల రోజుల సమయం ఉండగానే క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
రెండు దశాబ్దాల తర్వాత సమగ్ర పూడికతీత
నగరంలోని డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి కమిషనర్ కీలక విషయాలను ప్రస్తావించారు. గత 20 ఏళ్ల క్రితం మాత్రమే నాలాల్లో ఒక పద్ధతి ప్రకారం సమగ్రంగా పూడికతీత (Desilting) పనులు జరిగాయని పేర్కొన్నారు. ఆ తర్వాత కాలంలో ఈ ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో వర్షపు నీరు సాఫీగా వెళ్లే మార్గాలు మూసుకుపోయాయని అభిప్రాయపడ్డారు. ఈసారి మాత్రం పరిస్థితిని చక్కదిద్దేందుకు యుద్ధ ప్రాతిపదికన డిసల్టింగ్ పనులు చేపట్టినట్లు తెలిపారు. వర్షాకాలం నాటికి ఈ పనులన్నీ పూర్తి చేసి నగర ప్రజలకు వరద గండం లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు.
కీలక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి అక్కడి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి, యూసఫ్ గూడా, కృష్ణానగర్, బోరబండ సహా మైత్రివనం వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో వరద నివారణకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ ఏరియాల్లో వర్షపు నీరు నిలవకుండా అడుగులు వేగంగా వేస్తున్నట్లు రంగనాథ్ వివరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని స్పష్టం చేశారు.
అక్రమ నిర్మాణాలపై కొరడా
నాలాలపై వెలిసిన అక్రమ నిర్మాణాలు వరద ముప్పునకు ప్రధాన కారణంగా మారుతున్నాయని కమిషనర్ రంగనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నాలా మార్గాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించారు. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న మరిన్ని నిర్మాణాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. అలాంటి అక్రమ నిర్మాణదారులకు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నాలా ఆక్రమణల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
ప్రజల భద్రతే ప్రాధాన్యం
ప్రతి ఏటా వానాకాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు పడుతున్న అవస్థలను గమనిస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. నీటి నిల్వలను అడ్డుకునే ప్రతి అడ్డంకిని తొలగించడమే తమ లక్ష్యమని తెలిపారు. నగర డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయడం ద్వారా భవిష్యత్తులో వరద నీరు రోడ్లపైకి రాకుండా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు రంగనాథ్ వివరించారు.








