తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న టీవీకే (TVK) అధినేత విజయ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తొలుత విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) అనూహ్యంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ పరిణామంతో విజయ్ కూటమిలో ఒక్కసారిగా కలకలం రేగింది. మరోవైపు మద్దతు ప్రకటించిన విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) నుంచి ఇప్పటి వరకు గవర్నర్‌కు అధికారికంగా ఎటువంటి మద్దతు లేఖ అందలేదు.
ఈ తాజా రాజకీయ పరిణామాల వల్ల టీవీకే కూటమి సంఖ్యా బలం ప్రస్తుతం 116 స్థానాలకు పరిమితమైంది. తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 కాగా విజయ్ మరో రెండు సీట్ల దూరంలో నిలిచిపోయారు. సంఖ్యా బలంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై మళ్లీ హైడ్రామా మొదలైంది. విజయ్ ఇప్పటికే రెండు సార్లు గవర్నర్‌ను కలిసినప్పటికీ సంఖ్యా బలం సరిగ్గా లేకపోవడంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఇప్పటి వరకు అధికారికంగా ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు.
ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరిగా మారింది. మద్దతు ఇస్తామని చెప్పిన పార్టీలు వెనక్కి తగ్గడం లేదా అధికారికంగా లేఖలు ఇవ్వకపోవడంతో విజయ్ క్యాంపులో ఆందోళన మొదలైంది. గవర్నర్ నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. రానున్న కొన్ని గంటల్లో విజయ్ ఏ విధంగా పావులు కదుపుతారో అన్నది ఉత్కంఠగా మారింది.








