సికింద్రాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన యావన్ (23) అనే బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థిని సీతాఫల్‌మండి నడిరోడ్డుపై ప్రత్యర్థులు కత్తులతో పొడిచి కిరాతకంగా హతమార్చారు. నిందితులు యువతి బంధువులేనని పోలీసులు నిర్ధారించారు.
మృతుడు యావన్ గత నాలుగేళ్లుగా సీతాఫల్‌మండి ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వారు తీవ్రంగా వ్యతిరేకించారు. యావన్‌ను పలుమార్లు హెచ్చరించినా అతను తన ధోరణి మార్చుకోలేదు. పైగా సీతాఫల్‌మండిలో ఉండే తన స్నేహితుడి ఇంట్లోనే ఉంటూ తరచూ ఆ యువతిని కలుస్తున్నాడు. ఈ ప్రవర్తనపై కోపం పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం నిన్న రాత్రి మూడు ద్విచక్ర వాహనాలపై ఆరుగురు దుండగులు స్నేహితుడి ఇంటికి చేరుకున్నారు.
యావన్ తన మిత్రులతో కలిసి టీవీ చూస్తున్న సమయంలో నిందితులు ఒక్కసారిగా లోపలికి చొరబడి కత్తులతో దాడికి దిగారు. వారి బారి నుంచి తప్పించుకోవడానికి యావన్ బయటకు పరిగెత్తినా వదలకుండా నడిరోడ్డుపై వెంబడించి నరికి చంపారు. దుండగులు అత్యంత క్రూరంగా యావన్ శరీరంపై 17 చోట్ల కత్తులతో పొడిచారు. తీవ్ర రక్తస్రావం కావడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నిందితులు దాడి చేసిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బహిరంగ ప్రదేశంలో యువకుడిని వెంటాడి చంపడంతో సీతాఫల్‌మండి ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉన్నత చదువులు చదువుతూ భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా దారుణ హత్యకు గురికావడం విషాదం నింపింది.








