దీపావళి పండుగ అంటే యువత, పెద్దలు, పిల్లలు కలిసి టపాసులు పేల్చుకుంటూ కుటుంబ సభ్యులంతా సరదాగా గడుపుతుంటారు. కానీ, హైదరాబాద్ నగరంలోని కొందరు యువత రాత్రివేళ రోడ్లపైకి వచ్చి ఇష్టారీతిన బాణసంచా కాలుస్తూ, బైక్ లపై విన్యాసాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
‘దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతోపాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం..?’ అంటూ సజ్జనార్ ప్రశ్నించారు. సజ్జనార్ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందించారు. పండుగ పూట కాదు సర్.. ప్రతీరోజూ ఇదే వికృతానందం అని కొందరు పేర్కొనగా.. ఇలాంటి ఆకతాయిల చేష్టల వల్ల మిగతా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. రాత్రివేళ బైక్ లపై ఇష్టారీతిలో వ్యవహరించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు విజ్ఞప్తి చేశారు.