రాష్ట్రంలో చేపట్టనున్న కులగణన దేశవ్యాప్తంగా ఒక మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం సచివాలయంలో సామాజికవేత్తలు, మేధావులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. కులగణనలో చేయాల్సిన మార్పులు, చేర్పులు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారితో సమాలోచనలు జరిపారు.
రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి చేపట్టనున్న కులగణనకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక, దిశా నిర్దేశం చేయడానికి మంగళవారం కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి సమాచారం తీసుకునేందుకు ఇంకా ఎలాంటి ప్రశ్నలు వేస్తే బాగుంటుంది అని వారిని సలహాలు అడిగారు.
రాష్ట్రవ్యాప్తంగా 300 మంది సామాజికవేత్తలు, మేధావులు, అభ్యుదయ వాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను, సందేశాలను పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. వీరితో పాటు కుల సంఘాలు, యువజన సంఘాలను పిలిచి వారి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు.









