హైదరాబాద్‌లోని ఓ బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ పరిధిలోని బొగ్గులకుంటలో ఉన్న ఓ బాణసంచా దుకాణంలో చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న హోటల్లకు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించిన విషయం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అధికారులు.. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
దీపావళి పండగ సీజన్.. పైగా ఆదివారం కావడంతో జనం రోడ్లపైకి వచ్చి షాపింగ్‌లు చేస్తున్న వేళ.. ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు 5 ఫైరింజన్లను రప్పించారు. మంటల ధాటికి అక్కడే ఉన్న వాహనాలు దగ్ధం అయ్యాయి. స్థానికంగా ఉన్న దేవాదాయశాఖ కార్యాలయానికి సమీపంలోనే ఈ అగ్ని ప్రమాదం జరిగింది.
ఇక ఈ ఘటనలో అక్కడే ఉన్న ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఆ దుకాణాంలో బాణాసంచా ఎక్కువగా ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. బాణసంచా దుకాణంలో ఉన్న పటాకులు అంటుకుని పేలడంతో అవి పక్క దుకాణాలకు, అక్కడ పార్క్ చేసిన వాహనాలపై పడటంతో వాటికీ మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ బాణసంచా దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి దృశ్యాలను స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.
అబిడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన స్థానికులు pic.twitter.com/ujClAOEbiY
— Prashanth (@itzmibadboi) October 27, 2024









