– రేవ్ పార్టీ నుంచి‘సుద్దపూస’ను కావాలనే తప్పించారు.. అంటూ ఘాటు వ్యాఖ్యలు
కేటీఆర్ బామ్మర్ది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ టార్గెట్‌గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సుద్దపూస.. ఇప్పుడేమంటావ్.. బామ్మర్ది ఫాంహౌజ్‌లోనే రేవ్ పార్టీలా? డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో. సుద్దపూసను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయ్.’ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
రేవ్‌పార్టీపై విచారణ జరపాల్సిందే..
సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్ పై రాజీధోరణి ఎందుకు? అని ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలన్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాల్సిందేనని అన్నారు. బడా నేతలతోసహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలుండాలన్నారు.









