ప్రజా పాలనను ఓర్వలేకనే అక్కసు..
అసలైన దొంగలు గులాబీ పార్టీ నేతలే
పదేండ్లలో ప్రజలకు చేసిందేమీలేదు..
బీఆర్ఎస్ అంటేనే మోసపూరిత పార్టీ
రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే
సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఖబడ్దార్..
కేటీఆర్, జోగు రామన్నపై కంది శ్రీనివాసరెడ్డి ఫైర్
మీడియా సమావేశంలో విమర్శలను తిప్పికొట్టిన కేఎస్ఆర్
ఆదిలాబాద్ అమ్మన్యూస్ ప్రతినిధిః ప్రాణహితను బొందబెట్టి, కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి ఇప్పుడు నంగ నాచి కబుర్లు చెప్పడం సిగ్గుచేటని, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలనను చూసి ఓర్వలేకనే.. బీఆర్ఎస్ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. రాంలీలా మైదానం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన విమర్శలను తిప్పికొట్టారు. పరుషపదజాలంతో దూషించడంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాటే అన్న చందంగా బీఆర్ఎస్ వ్యవహారం ఉందంటూ దుయ్యబట్టారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. లక్ష రుణమాపీ చేస్తామని మాట తప్పిన అసలైన 420లు బీఆర్ఎస్ నేతలని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క రైతుకైనా రుణమాఫీ చేశారా అంటూ ప్రశ్నించారు. పదేండ్లు అధికారంలో ఉండి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసింది మీరు కాదా అంటూ నిలదీశారు. ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా ఇంకా బుద్ధిరావడంలేదన్నారు. కేటీఆర్ ముఖం హైదరాబాద్‌లో చల్తలేదని, అబద్దాలు, మాయమాటలు చెప్పి ఆదిలాబాద్ ప్రజలను మరోమారు మోసం చేద్దామనే ఇక్కడకు వచ్చాడని కేటీఆర్‌పై మండిపడ్డారు. జనానికి ముఖం చూపించే దమ్ములేక ఫామ్‌హౌస్‌లోనో..ప్రగతి భవన్‌లోనో దాక్కునే పాలన తమది కాదని, ప్రజలకిచ్చిన మాటకోసం కట్టుబడే ప్రభుత్వమని నొక్కి చెప్పారు. తమ రేవంత్‌రెడ్డి భాజాప్త చెప్తాడని, చెప్పిన ప్రతిహామీని నెరవేరుస్తామన్నారు.
మాట తప్పడం మీ నైజం..
ఆనాడు ఉద్యమం సమయంలో తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చెప్పి మాటిచ్చి తప్పింది ఎవరని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ నష్టపోయే ప్రమాదముందని తెలిసినా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం తమదని, జిల్లాలో 55 వేల మందికి పైగా 600 కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. ఇటీవల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను గుర్తించి 3 వేల 96 ఎకరాలకు పరిహారం అందించామని తెలిపారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు పదినెలల్లోనే 40 వేలకుపైగా ఉద్యోగాలిచ్చిన చరిత్ర కాంగ్రెస్‌దని గుర్తు చేశారు. పదేళ్లు అధికారమిస్తే కనీసం గ్రూపు 1 పరీక్ష పెట్టలేని అసమర్థులు ఏ ముఖం పెట్టుకుని ఊర్లు తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు పదేళ్లు చేసిన ఆగానికి ప్రజలు రోడ్లమీదకు ఊరికొచ్చికొట్టే వాతావరణం ఏర్పడిందన్నారు. కాళేశ్వరం, ధరణి పేరుతో లక్షల కోట్ల కుంభకోణాలు చేసి ఇప్పుడు నీతులు చెప్పడం…బూతులు మాట్లాడడం మీకే చెల్లిందంటూ ఎద్దేవా చేశారు. డీఎస్సీ పరీక్ష పెట్టి ఒక్కరికైనా ఉద్యోగాలు కల్పించారా అంటూ ప్రశ్నించారు. చేసిదంతా చేసి సుద్దులు చెప్పడం, మసిపూసి మారేడు కాయ చేయడం ఇకనైనా ఆపాలన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలు..
మహారాష్ట్రకు వెళ్లి కాంగ్రెస్‌కు ఓటేయ్యద్దని చెప్పడమంటే బీజేపీకి వేయమనే కదా అర్థమని, దీన్నిబట్టే బీజేపీ, బీఆర్ఎస్‌లు తోడు దొంగలని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుందని అన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకుడిని, ముఖ్యమంత్రిని పట్టుకుని చిల్లర మాటలు మాట్లాడడం నీచమని, సంస్కారహీనులని మండిపడ్డారు. అసంటోళ్లకే ఇటువంటి మాటలొస్తాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అప్పలను సరిచేస్తూ బ్రహ్మండంగా ముందుకుపోతున్నామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతోపాటు 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు.
ఐదు వందలకే గ్యాస్ సిలిండర్, 20 వేల కోట్ల రుణమాఫీ, 40 వేల ఉద్యోగాలు ఇవన్నీ కాంగ్రెస్ సాధించిన విజయాలన్నారు. కేటీఆర్ తిరుగులేని నాయకుడైతే పదేళ్లలో సీసీఐ పరిశ్రమను ఎందుకు తెరిపించలేదన్నారు. కేటీఆర్ ఆదిలాబాద్ చేసిన అన్యాయం అంతాఇంతాకాదన్నారు. టెక్స్‌టైల్ పార్కును వరంగల్‌కు మళ్లించి ఇక్కడి ప్రజల నోట్లో మట్టి కొట్టాడని విమర్శించారు. ప్రాణహితను బొందపెట్టి, కమీషన్ల కాళేశ్వరం కట్టి, సీసీఐను రాజకీయాలకు వాడుకుని ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడడం మీకే చెల్లిందన్నారు. అందుకే ప్రజలు తరిమికొట్టారన్నారు. అసెంబ్లీ పార్టీని తిరస్కరించి పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్నా కొట్టారన్నారు. అయినా అబద్దాలు వల్లవేస్తూ మళ్లీ తిరుగుతున్నారని, ప్రజల చేతిలో మళ్లీ పరాభవం తప్పదని జోస్యం చెప్పారు.









