– గత పదేళ్లలో వారు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు..
– రెండు రోజుల్లో రాజకీయ బాంబులు పేలబోతున్నాయ్..
– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రులు, వారి తొత్తులు మూసి వెంట కబ్జాలు చేశారని, అవి ఖాళీ చేయిస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని వారు, వీరు ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నారని, బావబామ్మర్దులు పబ్లిసిటీతో పబ్బం గడుపుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. పబ్బం గడుపుకోవడానికి మూసి పేరిట రాజకీయం చేస్తున్నారని, తప్పు చేస్తే ఉపేక్షించబోమని అన్నారు. గత ప్రభుత్వంలో చట్టాలు ఉల్లంఘించి చేసిన పనుల రికార్డులు సిద్ధం చేశామని తెలిపారు. వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్నదే తమ ఉద్దేశమని, రెండు రోజుల్లో ఏం జరుగుతుందో మీరే చూస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఫైళ్లన్నీ సిద్ధం చేశాం..
దీపావళికి ముందే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ బాంబు పేల్చారు. దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో హాన్ నది పునరుజ్జీవనంపై అధ్యయనానికి వెళ్లిన పొంగులేటి అక్కడ ఓ తెలుగు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని.. ప్రధాన నేతలకు పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి వంటి సుమారు 8 నుంచి 10 ప్రధాన అంశాల్లో చర్యలు ఉంటాయన్నారు. ఇందుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలతో ఫైళ్లు కూడా సిద్ధం చేశామని తెలిపారు.
కక్షసాధింపు కాదు..
ఇది కక్షసాధింపు కాదని.. పూర్తి ఆధారాలతో సర్కారు చర్యలు తీసుకోబోతోందని స్పష్టం చేశారు. తప్పు చేసింది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ దాదాపు పూర్తయిందని, మొత్తానికి ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి అంశాలు ట్రాక్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఎలాంటి చర్యలు లేవని ప్రజలు భావించవద్దని, వారు కోరుకునే విధంగా పూర్తి ఆధారాలతో ముందుకు రాబోతున్నామని వెల్లడించారు.
రూ.కోట్ల భూములు తాకట్టు..
గత ప్రభుత్వంలో ధరణి అనే భూతాన్ని తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టారని, విదేశీ కంపెనీలకు కోట్ల భూములను తాకట్టు పెట్టారని, ధరణి పేరుతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక ధరణిని బంగాళా ఖాతంలో వేస్తాం అని చెప్పామని… చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నామని అన్నారు. విదేశీ కంపెనీ కబంధహస్తాల నుంచి కేంద్రంలోని ఎన్‌ఐసికి అప్పగిస్తున్నామన్నారు. 2024 కొత్త ఆర్‌ఓఆర్ చట్టాన్ని తీసుకు వస్తున్నామని, 15 దేశాల్లోని మంచి రెవెన్యూ అంశాలను తీసుకుని డ్రాఫ్ట్ తయారు చేశామని చెప్పారు. ఇప్పటికే డ్రాఫ్ట్ కు తుది మెరుగులు దిద్దామన్నారు. డిసెంబర్ నుంచి కొత్త ఆర్‌ఓఆర్ చట్టాన్ని అమలులోకి తెస్తామన్నారు. ధరణీలోని 36 మ్యాడుల్స్ తొలగించి సింగిల్ డిజిట్‌లో మ్యాడుల్ తెస్తున్నామని, పార్ట్ బి లోని 13 లక్షల ఎకరాల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం పెద్దలు తమ తొత్తులకు ఇచ్చిన ప్రభుత్వ భూములను వెలికి తీస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.









