AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం.. ఎంతంటే..

ఖైరతాబాద్ మహాగణపతి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వింతలు, విశేషాలు, రికార్డులతో దూసుకెళ్తున్న ఖైరతాబాద్ బడా గణపతికి ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో హుండీ ఆదాయం వచ్చినట్లు గణేష్ ఉత్సవ కమిటీ వెల్లడించింది. మంగళవారం నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో సోమవారం హుండీ లెక్కింపు చేపట్టారు. పటిష్ఠమైన బందోబస్తు, సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో కళ్లు చెదిరే ఆదాయం వచ్చినట్లు చెప్పారు. కేవలం హుండీ ఆదాయం మాత్రమే కాకుండా ఆన్‌లైన్ పేమెంట్ల ద్వారా కూడా డబ్బు సమకూరింది. మరోవైపు యాడ్స్ ద్వారా కూడా లక్షల్లో ఖైరతాబాద్ మహా వినాయకుడికి ఆదాయం వచ్చినట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు.

గణేష్ చతుర్థి సందర్భంగా నవరాత్రులు పూర్తి చేసుకున్న ఖైరతాబాద్ మహాగణపతి.. గత 9 రోజులుగా ఘనంగా పూజలు అందుకుని.. రేపు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఇక 9 రోజులుగా ఖైరతాబాద్ మహా వినాయకుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు భారీగా నగదు, కానుకలు సమర్పించారు. ఈ క్రమంలోనే ఈసారి ఖైరతాబాద్ గణేషుడి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. కానుకల ద్వారా ఏకంగా రూ. 70 లక్షలు హుండీ ఆదాయం వచ్చినట్లు గణేష్ ఉత్సవ కమిటీ తాజాగా తెలిపింది. వీటితోపాటు హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షలు సమకూరినట్లు పేర్కొన్నారు. ఇవేకాకుండా.. ఆన్‌లైన్ ద్వారా.. వినాయకుడి విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ స్కానర్ల ద్వారా కూడా విరాళాలు వచ్చాయని.. అయితే వాటిని ఇంకా లెక్కించాల్సి ఉందని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

ANN TOP 10