కాంగ్రెస్ ప్రభుత్వం పంతం నెరవేర్చుకుంది.. సెక్రటేరియట్ ముందు దివంగత మాజీ ప్రధాని విగ్రహాన్ని ఆవిష్కరించింది. అనేక వివాదాలు, విపక్షపార్టీ ఆక్షేపణల నడుమ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ భారీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో బదులిచ్చారు. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. రండి… విగ్రహాన్ని ఎవడొచ్చి తొలగిస్తాడో నేను చూస్తా… మాపై నోరు జారితే ఫాంహౌస్ లో జిల్లేళ్లు మొలిపిస్తా అని హెచ్చరించారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా తామే పెడతామని స్పష్టం చేశారు. డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు. తెలంగాణను మొత్తం దోచుకోవాలి, తామే దోచుకోవాలని కేసీఆర్ కుటుంబం భావిస్తోందని, కానీ కాంగ్రెస్ కార్యకర్తలు బండకేసి కొడతారని వాళ్లు ఊహించలేదని అన్నారు.
“ఆయన ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఫాంహౌస్ లో ఆయనకు రెగ్యులర్ గా షాక్ ట్రీట్ మెంట్ లు జరుగుతున్నాయి. ఎందుకంటే… అధికారం పోయింది, ప్రజాపాలన వచ్చింది, గడీలు బద్దలైపోయాయి, ఇవాళ వాళ్ల బతుకులు దివాలా తీశాయి అనే వాస్తవాలు ఆయనకు ఇంకా అర్థం కావడం లేదు కాబట్టి.
ఈ లోపల కొంతమంది చిల్లరమల్లరగాళ్లను మాపై మాట్లాడిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అప్రమత్తంగా ఉండాలి. ఈ కాలకేయ ముఠా మళ్లీ గ్రామాల మీదికి రాబోతోంది” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు మదం దిగలేదని వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబ పాలన అని విమర్శిస్తున్నారని… మరి కేసీఆర్ సీఎంగా, కొడుకు, అల్లుడు మంత్రులుగా వ్యవహరించలేదా అని ప్రశ్నించారు. త్యాగం అంటే సోనియా గాంధీది… వీళ్లు చేసింది కూడా ఓ త్యాగమేనా? అని పేర్కొన్నారు.
వారసత్వ రాజకీయాలు అని పదే పదే అంటున్నారు… తండ్రిని అడ్డుపెట్టుకుని కొందరు పదవులు పొందలేదా? అని రేవంత్ నిలదీశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఏ పదవి కూడా చేపట్టలేదని వివరించారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ అని వెల్లడించారు. కంప్యూటర్లు రాకపోతే సిద్ధిపేటలో ఇడ్లీ, వడ అమ్ముకునేవాళ్లని ఎద్దేవా చేశారు.
అవినీతిపరులకు గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. ఎక్స్ లో ట్వీట్ చేసేవాళ్లు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.