AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముగిసిన ఒలింపిక్స్.. 40 బంగారు పతకాలతో టాప్‌లో అమెరికా!

తాజాగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఏకంగా 126 పతకాలతో చైనాను వెనక్కు నెట్టి తొలి స్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్‌లో అమెరికా క్రీడాకారులు 40 బంగారు పతకాలు, 44 వెండి పతకాలు, 42 కాంస్య పతకాలు సాధించి తమ దేశాన్ని అజేయంగా నిలిపారు. బంగారు పతకాల్లో అమెరికా రికార్డును సమం చేసినప్పటికీ చైనా 91 మెడల్స్‌తో సరిపెట్టుకుంది. రెండో స్థానానికి పరిమితమైంది. చైనా చివరి సారిగా 2008 ఒలింపిక్స్‌లో అమెరికాను వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచింది. అప్పట్లో చైనాకు 48 బంగారు పతకాలు వచ్చాయి.

ఈసారి ఒలింపిక్స్‌లో బంగారు పతకాల పరంగా చైనా తొలుత ముందంజలో ఉన్నప్పటికీ చివరి నిమిషంలో అమెరికా చైనా రికార్డును సమం చేసింది. బాస్కెట్‌బాల్ డబుల్స్ పోటీలో అమెరికా మహిళల టీం ఫ్రాన్స్‌పై 67-66తో గెలిచి బంగారు పతకం ఎగరేసుకుపోయింది. ఈ ఒలింపిక్స్‌లో చైనా.. డైవింగ్, స్విమ్మింగ్ లాంటి పూల్ ఈవెంట్స్‌తో పాటు టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్‌లో ఆధిపత్యం కనబరిచింది. అమెరికా మాత్రం ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో పైచేయి సాధించి మొత్తం 14 బంగారు పతకాలు, 11 వెండి పతకాలు, 9 కాంస్య పతకాలను ఎగరేసుకుపోయింది. పూల్ ఈవెంట్స్‌లో కూడా అమెరికా సత్తా చాటింది. 8 బంగారు పతకాలు సహా మొత్తం 28 మెడల్స్ సొంతం చేసుకుంది.

ఒక్క బంగారు పతకం కూడా సాధించని భారత్ 71వ స్థానానికి పరిమితమైంది. భారత్ తన ఖాతాలో 5 కాంస్య, ఒక వెండి పతకాన్ని వేసుకుంది. అయితే, అనర్హతకు గురైన వినేశ్ ఫోగట్ కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌ కు అప్పీలు చేసుకోవడంతో భారత పతకాల సంఖ్య పెరగొచ్చన్న అంచనాలు ఉన్నాయి. గత 44 ఏళ్లల్లో తొలిసారిగా ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన పాకిస్థాన్ 62వ స్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్‌లో జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌లు వరుసగా మూడు, నాలుగు, ఐదు, స్థానాల్లో నిలిచాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10