హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం గోల్కొండ కోటను సందర్శించారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మన సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా సాంప్రదాయ దుస్తులలో కళాకారులు ఇచ్చే ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ తెలిపారు. గుస్సాడి, కొమ్ము కోయ, లంబాడీ, డప్పులు, ఒగ్గు డొల్లు, కోలాటం, బోనాలు కోలాటం, భైండ్ల జమిడికల్, చిందు యక్షగానం, కర్రసాము, కూచిపూడి, భరతనాట్యం, పేర్ని వంటి వివిధ కళారూపాలకు చెందిన వెయ్యి మందికి పైగా కళాకారులు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రదర్శనలు ఇస్తారన్నారు. పిల్లలలో దేశభక్తి స్ఫూర్తిని నింపేందుకు వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.