AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బండ్ల ఇంటికి జూపల్లి.. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం..

ఎమ్మెల్యే కృష్ణమోహన్‌తో మంత్రి భేటీ
అరగంటకు పైగా సుదీర్ఘచర్చలు
ఎమ్మెల్యేతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌
బుజ్జగించేందుకేనా?
తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చినట్లేనా?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం..
రాష్ట్రంలో ఆసక్తికర చర్చ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లడమే ఇందుకు కారణం. బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి.. రెండు రోజుల క్రితం తిరిగి బీఆర్‌ ఎస్‌ పార్టీలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన మంత్రి.. ఎమ్మెల్యేతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. ఇరువురు నేతలు అరగంట సేపు వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఇరువురు నేతలు అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.

కొంతకాలంగా పార్టీలో అసంతృప్తితో ఉన్న ఆయన.. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కృష్ణ మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. దీంతో ఆయన తిరిగి బీఆర్‌ఎస్‌ చేరినట్లు వార్తలు వచ్చాయి.

కాంగ్రెస్‌లోనేకొనసాగేలా?..
బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగేలా కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టిసారించినట్లు తెలిసింది. ఈ క్రమంలో మంత్రి జూపల్లి గురువారం ఉదయం బండ్ల నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీలోనే ఉండాలని ఆయన్ను మంత్రి బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతారా..? తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతారా అనే అంశంపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ANN TOP 10