AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ..

కొన్ని గంటల్లో 53 అడుగులకు చేరుకునే అవకాశం
భయం భయంగా భద్రాచలం..
నిలిచిన రాకపోకలు
సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తం

(అమ్మన్యూస్, భద్రాచలం):
గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో నదీ ప్రవాహం క్రమేపీ పెరుగుతున్నది. మంగళవారం ఉదయం 8 గంటలకు నదీ ప్రవాహం 51.60 అడుగుల స్థాయికి చేరుకున్నది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం చుట్టుపక్కల గ్రామ ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మైకుల ద్వారా ముంపు ముప్పు గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. వరద నీటి మట్టం మరికొన్ని గంటల్లో 53 అడుగులకు చేరుకునే ప్రమాదం ఉంది. దాదాపు పదకొండు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. భద్రాచలం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.

ఉప నదుల వరద సైతం..
గోదావరి ఉపనదుల వరద నీరు కూడా గోదావరికి వచ్చి చేరడంతో గోదావరి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి నదులనుంచి వచ్చే వరద నీరు గోదావరిలో కలుస్తోంది. మంగళవారం రాత్రికి 53 అడుగులకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అప్పుడు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయవలసి వస్తుంది.గతంలో 1986 సంవత్సరంలో 70 అడుగుల స్థాయిలో భద్రాచలం వద్ద నీటి మట్టం నమోదయింది. తీరం వెంట గట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

వరద ముప్పు..
దుమ్ముగూడెం, భద్రాచలం ప్రాంతాలకే వరద ముప్పు తాకిడి ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దుమ్ముగూడెం పరిధిలో పదమూడు గ్రామాలు వరద నీటిలో చిక్కుకుంటాయని ఆ ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. 2023 సంవత్సరంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 73 గా నమోదయింది. అదే జరిగితే భద్రాచలం పరిధిలోని వందకు పైగా గ్రామాలు మునిగిపోతాయని అంటున్నారు. నీటి పారుదల అధికారులు ఎప్పటికప్పుడు వరద నీటి పరిస్థితి పట్ల అప్రమత్తం అవుతున్నారు. ఏ ఏ ప్రాంతానికి అధికంగా వరద ముప్పు పొంచి వుందో ఆ ప్రాంతాల ప్రజలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ANN TOP 10