– సమకూరే మొత్తం ఆదాయం (అంచనా) రూ.32.07 లక్షల కోట్లు
– ఇందులో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు
– అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు (అంచనా)
– ద్రవ్యలోటు 4.9 శాతం (అంచనా)
– రూ.3 లక్షల వరకూ జీరో ట్యాక్స్
– తెలంగాణకు మొండిచేయి.. ఏపీకి వరాలు..
(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తంలో వివిధ రంగాలన్నింటికీ కలిపి రూ.48.21 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. అంటే స్థూలంగా బడ్జెట్ పరిమాణం రూ.48.21 కోట్లు. ఇందులో మొత్తం ఆదాయాన్ని రూ.32.07 లక్షల కోట్లుగా, దానిలో పన్ను ఆదాయాన్ని రూ.28.83 లక్షల కోట్లుగా చూపించారు.
ఈ ఏడాది ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని బడ్జెట్‌లో అంచనా వేశారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా అంచనా కట్టారు. అదేవిధంగా నూతన పింఛన్ విధానంలో త్వరలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. సంప్రదింపుల కమిటీ సిఫార్సుల ఆధారంగా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలోనూ, ఇతర దేశాల్లో భారత్ పెట్టుబడుల విధానంలోనూ సరళీకరణలు తీసుకురానున్నట్లు వెల్లడించారు.
మరిన్ని సంస్కరణలు..
వాణిజ్య అనుకూల విధానాలకు జన్ విశ్వాస్ బిల్లుతో మరిన్ని సంస్కరణలు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. యూఎల్ పిన్ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి భూకమతానికి భూ ఆధార్ ద్వారా గుర్తింపు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
రూ.3 లక్షల వరకూ జీరో ట్యాక్స్..
బడ్జెట్‌లో కొత్తపన్ను విధానంలో పన్ను శ్లాబ్‌లకు కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. రూ.3 లక్షల వరకూ వ్యక్తిగత ఆదాయం ఉన్న వారు ఎలాంటి ట్యాక్స్ కట్టనక్కర్లేదని తెలిపింది. కొత్తపన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లు ఇలా ఉన్నాయి. మూడు లక్షల వరకు ఎలాంటి పన్నూ లేదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం ఉన్నవారికి 5 శాతం వరకు పన్ను వర్తిస్తుంది. అదేవిధంగా రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ 10 %, రూ. 10 లక్షల నుంచి రూ.12 లక్షలు వరకు 20 %, రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30 శాతం మేర పన్ను వర్తించనున్నట్లు విత్త మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇక స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచినట్లు స్పష్టం చేశారు.
తగ్గనున్న బంగారం, వెండి, మొబైల్ ఫోన్ల ధరలు..
బంగారం, వెండితో పాటు మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్లు, మొబైల్ సంబంధిత విడి విభాగాలపై కస్టమ్ డ్యూటీని 15 శాతం తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బంగారం, వెండిపైన కస్టమ్స్ సుంకాన్ని ఆరు శాతం తగ్గిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ–కామర్స్‌పై టీడీఎస్‌ను కూడా తగ్గించారు.
ఆర్థిక మంత్రి ప్రకటన మేరకు దేశంలోని కొన్ని వస్తువుల ధరలు తగ్గడం గానీ లేదా పెరగడం కానీ జరుగుతుంది. మరి వేటి ధరలు ప్రభావితం అవుతాయో వాటి గురించి తెలుసుకుందాం..
ధరలు పెరిగేవి..
– ప్లాస్టిక్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచారు.
– పెట్రోకెమికల్ – అమ్మోనియం నైట్రేట్పై కస్టమ్ డ్యూటీ పెరిగింది
– సిగరెట్లు
– ప్లాటినం వస్తువులు
– కాంపౌండ్ రబ్బరు
– కాపర్ స్క్రాప్
– దిగుమతి చేసుకున్న టెలికాం ఆధారిత పరికరాలు..
ధరలు తగ్గేవి
– బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలు
– ఎలక్ట్రిక్ వాహనాలు
– లిథియం బ్యాటరీలు
– సోలార్ ప్యానల్స్
– మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు
– సైకిల్స్
– ఆర్టిఫిషియల్స్ వజ్రాలు
కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటనలు..
– కొత్త పన్ను విధానం శ్లాబుల్లో మార్పులు. సున్నా నుంచి రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదని ప్రకటించారు.
– ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణం. అర్బన్ హౌసింగ్ కోసం వచ్చే 5 ఏళ్లలో రూ.2.2 లక్షల కోట్లు కేటాయింపు.
– ముద్ర యోజన కింద ఇచ్చే రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు
– గ్రామీణ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు
– వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ, 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌లు
– దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు
– మహిళలు, బాలికల కోసం రూ.3 లక్షల కోట్లతో పథకాలు
– విద్య, ఉపాధి, నైపుణ్య అభివృద్ధి కోసం రూ.1.48 లక్షల కోట్లు
– మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గింపు
– బంగారం, వెండిపై దిగుమతి సుంకం 6 శాతానికి తగ్గింపు
– ప్లాటినమ్‌పై దిగుమతి సుంకం 6.4 శాతానికి తగ్గింపు
– కొత్త ఉద్యోగుల కోసం 3 పథకాలు, ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు
– నెలకు గరిష్ఠంగా రూ. 1 లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు, 210 లక్షల మందికి లబ్ధి
– స్టాండర్డ్ డిడక్షన్ పెంపు. ఇప్పటివరకు రూ.50 వేలు ఉండగా దాన్ని రూ.75 వేలకు పెంచారు.
– ఇండస్ట్రియల్ ఏరియాల్లో పనిచేసే కార్మికులకు అద్దె గృహాల నిర్మాణం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ఇళ్లు
– దేశవ్యాప్తంగా కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొచ్చే ప్రణాళిక
– 5 రాష్ట్రాల్లోని రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు
– వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి రూ.1.5 లక్షల కోట్లు
– మౌలిక సదుపాయాల కల్పనకు జీడీపీలో 3.4 శాతానికి సమానమైన రూ.11.11 లక్షల కోట్ల కేటాయింపు
– దేశంలో ఎంపిక చేసిన నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల ఏర్పాటు
– రాష్ట్రాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ.1.5 లక్షల కోట్లతో దీర్ఘకాల వడ్డీ రహిత రుణాలు
– పీఎం స్వనిధి కింద వంద నగరాల్లో ప్రత్యేక వారాంతపు మార్కెట్ల ఏర్పాటు
– క్యాపిటల్ గెయిన్స్ విధానం సరళీకరణ, దీర్ఘకాల లాభాలపై 12.5శాతం పన్ను, స్టార్టప్‌లకు ప్రోత్సాహకం.. ఏంజెల్ ట్యాక్స్ రద్దు









