తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్ చేసిన కామెంట్స్ పై పలువురు మండిపడుతున్నారు. తాజాగా ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌లో కొందరు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. వికలాంగులను అగౌరవపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ హోదాలో ఉండి వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజస మని ప్రశ్నించారాయన.
దివ్యాంగులు ఐఏఎస్‌కు పనికిరారని వారికి శారీరకంగా పని చేయలేరని, ఫీల్డ్ విజిట్ చేయలేరని చేసిన కామెంట్స్ ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన స్మితా సబర్వాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతేకాదు ఈ విషయమై మానవ హక్కుల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగానే కాదు.. దేశవ్యాప్తంగా ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ చేసిన కామెంట్స్‌పై చర్చ జరుగుతోంది. కొందరు స్మిత వాదనను ఏకీభవిస్తుండగా, మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. రాజకీయ నాయకులు, మాజీ అధికారులు సైతం తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.









