AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇన్‌కంలో కేసీఆర్ పార్టీనే టాప్.. అన్ని వందల కోట్లా..?

తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉండి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొంది ప్రతిపక్షానికే పరిమితమైంది భారత్ రాష్ట్ర సమితి పార్టీ. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేని పరిస్థితికి చేరింది. ఇక అప్పటి నుంచి గులాబీ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా కారు దిగుతూ.. కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ గులాబీ బాస్ కేసీఆర్‌కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ భవితవ్యం ఏంటీ.. అసలు పార్టీ ఉంటుందా లేదా అన్న చర్చ జోరుగా సాగుతోంది. కాగా.. ఈ నేపథ్యంలోనే.. దేశంలోని ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) వెల్లడించిన తాజా రిపోర్టు.. విస్తుపోయే విషయాలను బయటపెట్టింది.

దేశంలోనే అన్ని ప్రాంతీయ పార్టీల కంటే ఎక్కువ ఆదాయం బీఆర్ఎస్ పార్టీదేనని ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్‌కు ఏకంగా.. 737.67 కోట్ల ఆదాయం వచ్చినట్లు రిపోర్టు పేర్కొంది. ఆదాయం విషయంలో బీఆర్‌ఎస్‌ టాప్‌లో ఉందని వెల్లడించింది. దేశంలోని ప్రాంతీయ పార్టీల ఫైనాన్షియల్ స్టేటస్‌ను విశ్లేషించిన ఏడీఆర్‌.. 57 పార్టీలకు గానూ 39 పార్టీల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసింది.

ఇన్‌కం విషయంలో బీఆర్ఎస్ టాప్‌లో ఉండగా.. రెండో స్థానంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఉన్నట్టు రిపోర్టు వెల్లడించింది. టీఎంసీ ఆదాయం 333.45 కోట్లుందని తెలపగా.. డీఎంకేకు 124.35 కోట్లు ఇన్‌కం వచ్చినట్లు ఏడీఆర్‌ పేర్కొంది. 39 ప్రాంతీయ పార్టీలకు మొత్తం 1740.48 కోట్లు సమకూరగా.. అందులో కేవలం 5 పార్టీలకే 1541.32 కోట్ల ఇన్‌కం ఉన్నట్టు రిపోర్ట్ పేర్కొంది. మొత్తం ఆదాయంలో 88.56 శాతం ఈ ఐదు పార్టీలకే రావడం గమనార్హం.

ఇక వ్యయాల విషయానికొస్తే.. ఆల్‌ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ మొదటి స్థానంలో ఉందని ఏడీఆర్‌ రిపోర్ట్ వెల్లడించింది. టీఎంసీ 181.18 కోట్లు ఖర్చుపెట్టగా.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 79.32 కోట్లు, బీఆర్ఎస్ 57.47 కోట్లు, డీఎంకే 52.62 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీ 31.41 కోట్లు ఖర్చు చేసినట్టు ఏడీఆర్‌ రిపోర్ట్ పేర్కొంది.

అయితే.. వచ్చిన ఆదాయంలో బీఆర్ఎస్ 680 కోట్లు ఇంకా ఖర్చు చేయలేదని.. రిపోర్టు పేర్కొంది. బిజూ జనతాదళ్‌ 171.06 ఖర్చు చేయకపోగా.. డీఎంకే రూ.161 కోట్లను ఖర్చుపెట్టలేదని ఏడీఆర్‌ వెల్లడించింది. అయితే.. ఈ పార్టీలు వచ్చిన ఆదాయాన్ని మిగిల్చుకోగా.. 20 ప్రాంతీయ పార్టీలు మాత్రం తమకు వచ్చిన ఇన్‌కం కంటే ఎక్కువ ఖర్చుపెట్టినట్లు రిపోర్టు తెలిపింది. ఈ విషయంలో జేడీఎస్ టాప్‌లో ఉంది. జేడీఎస్‌కు వచ్చిన ఇన్‌కం కంటే 490 శాతం అదనంగా ఖర్చు పెట్టినట్లు అంచనా వేసింది.

ANN TOP 10