కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం మైక్రోసాప్ట్ విండోస్ పనిచేయకపోవడంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో శుక్రవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం తలెత్తింది. దేశ విదేశాలకు వెళ్లాల్సిన 36 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు ప్రతినిధులు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
విమానాల రాకపోకలకు సంబంధించిన కార్యకలాపాలన్నీ కంప్యూటర్ల మీదే జరుగుతాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ సాంకేతిక సమస్య కారణంగా విమాన ప్రయాణికుల వివరాలను తనిఖీ, బోర్డింగ్ పాస్‌ల జారీని ఇవ్వలేకపోయారు. కొన్ని విమానాల రాకపోకలను కొనసాగించేందుకు బోర్డింగ్ పాస్‌లను మాన్యువల్‌గా రాసి ఇచ్చి విమానాల ప్రయాణాలు సాగేలా చర్యలు చేపట్టారు. సాంకేతిక సమస్య వల్ల విమాన సర్వీస్ సిగ్నళ్లకూ అంతరాయం ఏర్పడింది. అయితే విమాన సర్వీసుల రద్దు వల్ల కొందరు ప్రయాణికులు 7-8 గంటలపాటు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాశారు.









