AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇకపై మూడు రాజధానులు అంటూ ఆటలాడే పరిస్థితి రాష్ట్రంలో ఉండదని తేల్చి చెప్పారు. విశాఖపట్నంను ఆర్థిక, ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం విజయవాడలో జరిగిన ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు చెబుతూ ప్రజా తీర్పును గౌరవించి, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తామందిరిపైనా ఉందన్నారు.

గత పాలనలోనే పోలవరం దాదాపుగా పూర్తి..
సమష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం ఎంతో అవసరమని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని వివరించారు. నిజానికి 2014లో అధికారంలోకి వచ్చి ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించినపుడే పోలవరం ప్రాజెక్టు పనులను 72 శాతం పూర్తిచేశామని చంద్రబాబు చెప్పారు. వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని చెబుతూ.. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నదులను అనుసంధానించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ ఎకరానికీ నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు.

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం శిథిలమైంది..
గత ప్రభుత్వ హయంలో ఐదేళ్లలోనే రాష్ట్రం పూర్తిగా శిథిలమైందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో సమస్యల సుడిగుండంలో చిక్కుకుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు దెబ్బతిన్నాయని, రైతులు అప్పుల పాలయ్యారని చెప్పారు. సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను చక్కదిద్దే పని ప్రారంభిస్తామని వివరించారు. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళతామని చెప్పారు. ‘సీఎం పదవి హోదా కోసమే తప్ప పెత్తనం కోసం కాదు. సీఎం కూడా మామూలు మనిషే.. అలాగే మీ ముందుకు వస్తా. మిత్రుడు పవన్ కల్యాణ్ తో పాటు మేమంతా సామాన్యులుగానే ప్రజల వద్దకు వస్తాం’ అని చెప్పారు.

ప్రతి అడుగూ ప్రజాహితమే..
సీఎం పర్యటనల సందర్భంగా షాపులు, రోడ్లు మూసివేయడం, పరదాలు కట్టడం లాంటివి ఇకపై రాష్ట్రంలో కనిపించబోవని చెప్పారు. సిగ్నల్స్ దగ్గర వాహనాలను ఆపేయడం జరగదన్నారు. ‘ఐదు నిమిషాలు నాకు లేటైనా పర్వాలేదు కానీ ప్రజలకు అసౌకర్యం కలగవద్దు’ అని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు చంద్రబాబు తెలిపారు. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికీ భంగం కలగదని, ప్రతీ నిర్ణయం, ప్రతీ అడుగు ప్రజాహితం కోసమే ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10