వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మియాపూర్ మక్తా మహబూబ్‌పేట్‌లో వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో ఆరేళ్ల చిన్నారి చనిపోయాడు. వివరాల్లోకి వెళిదే.. బస్తీకి చెందిన సాత్విక్ అనే ఆరేళ్ల చిన్నారి.. గత రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండాపోయాడు. బాలుడి కుటుంబ సభ్యులు రాత్రి వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఇవాళ ఉదయం స్థానికంగా ఉన్న ఓ నిర్మానుష్య ప్రాంతంలో చిన్నారి మృతదేహం కనిపించింది.
స్థానికుల ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న మియాపూర్ పోలీసులు మృతేదహాన్ని పరిశీలించారు. బాలుడి ఒంటిపై కుక్కలు దాడి చేసిన ఆనవాళ్లు గుర్తించారు. పక్కనే డంపింగ్ యార్డ్ ఉండటంతో అక్కడ కుక్కలు ఎక్కువగా ఉంటాయని.. నిత్యం అవి దాడులు చేస్తాయని స్థానికులు చెబుతున్నారు. చిన్నారిని కూడా కుక్కలు దాడి చేసి చంపేశాయని అంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.