విత్తనాల సరఫరాలో లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ఈ మేరకు మంత్రి తుమ్మల కలెక్టర్లకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం సచివాలయంలో పత్తి, పచ్చిరొట్ట, విత్తనాల పంపిణీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. విత్తనాల సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని, ఎరువులు, విత్తనాలు రైతులకు అందించే బాధ్యత కలెక్టర్లదేనని సూచించారు. రద్దీ ఎక్కువగా ఉన్న చోట్ల కౌంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్లు, అధికారులు విస్తృతంగా పర్యటిస్తూ తనిఖీలు చేపట్టాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న చోట రైతులకు ఇబ్బందులు లేకుండా కౌంటర్లు ఎక్కువగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లాలకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామన్నారు. విత్తనాల కోసం రైతుల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ సీడ్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి సమావేశం కానున్నట్టు తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.









