తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో బహిరంగంగా రిజర్వేషన్ల దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. బుధవారం మధురాపూర్ లోక్‌సభ స్థానంలోని కద్వీప్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. టీఎంసీ ప్రభుత్వం తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం ద్వారా ముస్లింలకు ఓబీసీల హక్కులను కల్పిస్తోందని వ్యాఖ్యానించారు. దాంతో ఓబీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధి పథకాలను అమలు చేయడానికి టీఎంసీ నిరాకరిస్తోందని కామెంట్స్ చేశారు. దళితులు, వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగంపై దాడి చేస్తోందన్నారు. కలకత్తా హైకోర్టు తప్పుడు సర్టిఫికేట్లను రద్దు చేసినప్పటికీ, ఆ తీర్పును టీఎంసీ అంగీకరించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి ఇతర కార్యక్రమాల అమలును అడ్డుకుందని తెలిపారు. జాతీయ భద్రతకు సైతం విఘాతం కలిగిస్తోందన్నారు. టీఎంసీ, ఇండియా కూటమి పశ్చిమ బెంగాల్‌ని అభివృద్ధికి వ్యతిరేక దిశలో నెట్టివేస్తున్నాయని ప్రధాని మోడీ విమర్శించారు.









