మధ్యప్రదేశ్ ఛింద్‌వాడాలో ఓ వ్యక్తి తన కుటుంబంలోని 8 మందిని గొడ్డలితో నరికి చంపాడు. ఆపై అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తికి ఎనిమిది రోజుల క్రితమే వివాహమైనట్లు తెలుస్తోంది. తన భార్యతో పాటు సోదరుడు, అతని భార్య, ముగ్గురు పిల్లలు, తల్లిని అతడు అతి కిరాతకంగా ఇలా నరికి చంపేశాడు. ఎనిమిది మంది బాధితులు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
అనంతరం ఇంట్లోంచి బయటకు వెళ్లి ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తామియా జనపద్ పంచాయతీ పరిధిలోని బోదల్ కచర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామం మహుల్జీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.
నిందితుడు మామ తల్వీ సింగ్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ.. “దినేశ్ (27) నా మేనల్లుడు. అతను ఒక సంవత్సరం క్రితం మానసిక సమతుల్యతను కోల్పోయాడు. అయితే, చికిత్స తర్వాత అతను సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. మేము అతనికి ఈ ఏడాది మే 21న వివాహం చేసాము.పెళ్లయిన కొద్ది రోజులకే అతనికి మళ్లీ మానసిక సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలోనే అతను తన భార్య వర్షా బాయి, అతని అన్న శర్వాన్, శర్వాన్ భార్య బారాతో బాయి, అతని తల్లి సియా బాయి , శర్వాన్ ముగ్గురు పిల్లలను చంపాడు. వారందరూ ప్రాంగణంలో నిద్రిస్తున్న సయమంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆపై దినేశ్ చెట్టుకు ఉరివేసుకున్నాడు” అని చెప్పాడు.









