AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తడిచిన ధాన్యం కూడా ఎంఎస్‌పీకి కొంటాం: భట్టి

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నేటి యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, వాతావరణ సూచనలు రైతులకు అందించాలని సూచించారు. వర్ష సూచనపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అబద్దాలు బీఆర్‌ఎస్ పార్టీ నేతలకు అలవాటే అంటూ ఫైర్ అయ్యారు.

గత ప్రభుత్వం కంటే తామే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. 15 రోజుల ముందుగానే ధాన్యం కొంటున్నామని, గతం కంటే ఎక్కువగా 7,215 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. రైతులకు మూడు రోజుల్లోనే డబ్బులు వేస్తున్నామన్నారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని గత ప్రభుత్వం కొనలేదని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం తడిచిన, మొలకెత్తిన ధాన్యానికి కూడా ఎంఎస్‌పీ ధరకు కొంటామని చెప్పారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందకూడదని అన్నారు. రైతులందరూ ధైర్యంగా ఉండాలని, నిశ్చింతగా ఉండాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. రూ. 500 బోనస్ సన్న వడ్లకే అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. రూ. 500 బోనస్ అనేది సన్న వడ్ల నుంచే మొదలు పెట్టారని తెలిపారు. దొడ్డు రకం వడ్ల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భట్టి విక్రమార్క చెప్పారు.

ANN TOP 10