మరణశిక్ష అమలుకు సంబంధించి ప్రస్తుతమున్న ఉరితీసే పద్ధతినే కొనసాగిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఉరిశిక్ష స్థానంలో విషం ఇంజెక్షన్, కాల్చి చంపడం, విద్యుత్ కుర్చీ లేదా గ్యాస్ ఛాంబర్ వంటి తక్కువ వేదన కలిగించే మార్గాలను ప్రత్యామ్నాయంగా అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రస్తుతానికి దేశంలో ఉరిశిక్షే చట్టబద్ధమైన ఏకైక మార్గమని స్పష్టం చేసింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించి డిస్మిస్ చేసింది. గతంలో ఈ అంశంపై వెలువడిన మూడు కీలక తీర్పులను పునఃసమీక్షించేందుకు అత్యున్నత స్థాయి ధర్మాసనానికి పంపాలని పిటిషనర్ కోరగా దానికి తగిన ప్రాతిపదిక, బలమైన కారణాలు లేవని కోర్టు తేల్చిచెప్పింది.
న్యాయవాది రిషి మల్హోత్రా దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో (PIL) ఉరితీసే విధానం అత్యంత క్రూరమైనదని, మానవత్వానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఉరితీసిన తర్వాత మరణించారని ధ్రువీకరించేందుకు దాదాపు 40 నిమిషాలు పడుతుందని అన్నారు. అదే పాయిజన్ ఇంజెక్షన్ లేదా తుపాకీతో కాల్చడం ద్వారా ఐదు నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
సీఆర్‌పీసీలోని సెక్షన్ 354(5) కింద ఉరిశిక్షను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన మరణం పొందే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం మరణశిక్ష విధించినప్పుడు తక్కువ బాధ మాత్రమే ఉండేలా చూడాలని గుర్తుచేశారు. అయితే పిటిషనర్ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది.
అయితే ఈ తీర్పుతో ఉరిశిక్ష విధించే అంశం పూర్తిగా ముగిసిపోలేదని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. భవిష్యత్తులో శాస్త్రీయ, వైద్య పరమైన ప్రామాణిక ఆధారాలు లభిస్తే రాజ్యాంగపరమైన పునఃసమీక్షకు తలుపులు తెరిచే ఉంటాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది.
మరోవైపు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదనలు వినిపించారు. ఈ అంశాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే ఖైదీలకు ఉరిశిక్ష లేదా విషపు ఇంజెక్షన్‌లలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనను మాత్రం ఆయన తోసిపుచ్చారు. అది ఆచరణాత్మకంగా సాధ్యం కాదని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలంతో పాటు మారేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని శతాబ్దాల నాటి పాత పద్ధతినే పట్టుకుని వేలాడుతోందని వ్యాఖ్యానించింది.








