బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా యూ- ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, రూ. 500 కోట్లు చేతులు మారాయని ఏలేటి కీలక ఆరోపణలు చేశారు. అందులో రూ.100 కోట్లు మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి పంపించారని అన్నారు. ఎన్నికల ఖర్చుల కోసమే రూ.100 కోట్లు ఢిల్లీకి పంపించారని చెప్పారు. తాను సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికే మంత్రి ఉత్తమ్ డబ్బులు పంపించారని ఆయన వ్యాఖ్యానించారు.
దీనిపై తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని చెప్పారు. మహేశ్వర్ రెడ్డి అసలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యూ ట్యాక్స్ వసూలు చేశామనడం అబద్దామని కొట్టిపరేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అద్భుతమైన పాలన అందించామని అన్నారు. అస్థవ్యస్థంగా ఉన్న ప్రభుత్వాన్ని గాడిలో పెట్టామని చెప్పారు. కుటుంబంతో దైవ దర్శనానికి వేరే రాష్ట్రానికి వెళ్లానని తెలిపారు. రేపు సాయంత్రం హైదరాబాద్‌కు వస్తున్నామని, ఏలేటి మహేశ్వర్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.









